టీఆర్‌ఎస్‌ పాక్షిక మేనిఫెస్టో ఇదే | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 16 2018 7:02 PM

CM KCR Announces Partial Manifesto  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అధికారంలోకి వస్తే లక్షలోపు రుణమాఫీతో పాటు ప్రస్తుత ఫించన్లు రెట్టింపు చేస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఎన్నికల ప్రణాళిక కమిటీ నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించనప్పటి పరిస్థితులుకు తాజా పరిస్థితులకు ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. మేనిఫెస్టో కమిటీకి అన్ని వర్గాల నుంచి మొత్తం 3500 విజ్ఞాపనలు వచ్చాయన్నారు. వీటన్నిటిపై సుదీర్ఘంగా చర్చించి క్రోడీకరించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎలక్షన్‌ అంటే చాలా మందికి పొలిటికల్‌ గేమ్ అని.. తమకు మాత్రం ఓ టాస్క్‌ అని తెలిపారు.

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయంతో ముడిపడిన నీటి వనరులుకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. మిషన్‌ కాకతీయ చెరువుల పునరుద్ధరణతో పాటు ప్రధాన ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామన్నారు. కోటి ఎకరాలకు నీళ్లు అందించాలనే లక్ష్యంతో పనిచేసి సఫలమయ్యామన్నారు. 2020 వరకు కొంచెం అటుఇటుగా కోటి ఎకరాలకు నీళ్లు వస్తాయని స్పష్టం చేశారు. అప్పటి వరకు అన్ని ప్రాజెక్టులు పూర్తయి నీళ్లు అందుతాయన్నారు. రైతాంగానికి అండగా ఉండే మిషన్‌ కాకతీయ, రైతు బంధు పథకం, రైతు భీమా పథకాలతో పాటు కరెంట్‌ సమస్యలు తీర్చామన్నారు. అలాగే ఎరువులు సకాలంలో అందిస్తున్నామని తెలిపారు.

రైతు బంధు పథకంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధావులు ప్రశంసలు కురిపిస్తున్నారని చెప్పారు. రైతు భీమా పథకంతో ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రూ.5 లక్షల నష్టపరిహారం అందిస్తున్నామని తెలిపారు. రైతు సమన్వయ సమితులు కూడా ఏర్పాటు చేశామన్నారు. భవిష్యత్తులో రైతులు రాజులు కావాలంటే... ఇంకొన్ని రోజులు ఆదుకోవాలని, రైతులు అప్పుల నుంచి భయటపడి తమ పెట్టుబడి తమే పెట్టుకునే వరకు టీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో మొత్తం 45 లక్షల మంది రైతులు అప్పులు తీసుకున్నారని, ఇందులో రూ.1 లక్ష లోపు తీసుకున్నవారు 42 లక్షలున్నారని తెలిపారు. ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మళ్లీ ఆ లక్ష రూపాయలను ఒక విడతలోనే రుణమాఫీ చేస్తామని కేసీఆర్‌ పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించారు. 

మేనిఫెస్టోలో కేసీఆర్‌ ప్రకటించిన ముఖ్యాంశాలు..

1. లక్ష రూపాయలు మళ్లీ రుణమాఫీ చేస్తాం. రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం. ఒక విడతలోనే పూర్తిగా రుణమాఫీ.
2. రైతు బంధు పథకం కింద ఎకరానికి రెండు వేలు పెంచుతూ పంటకు 5వేల చొప్పున ఏడాదికి రూ.10 వేలిస్తాం 
3. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యునిట్‌ ప్రతి రెండు నియోజకవర్గాల మధ్య ఏర్పాటు చేసి.. ఐకేపీ మహిళలకు నిర్వహణ బాధ్యతలు ఇస్తాం. రైతు సమన్వయ సమితులకు గౌరవ వేతనం అందిస్తాం. 
4. ఆసరా పెన్షన్లు ఇప్పుడు 40 లక్షల మంది తీసుకుంటున్నారు. వయసు నిబంధన 65 ఏళ్లుగా ఉంది. ఈ వయసు తగ్గించాలని చాలా మంది విజ్ఞప్తి చేశారు. 57 ఏళ్లు పూర్తి అయిన ప్రతి ఒక్కరికి ఆసరా ఫించన్‌ అందేలా కృషి చేస్తాం. దీంతో మరో 8 లక్షల మంది పెరుగుతారు. ఈ పథకంపై ప్రజలు అత్యంత ఎక్కువ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫించన్‌ పెంచాలని వినతులు పంపించారు. దీంతో పెన్షన్‌లను రెట్టింపు చేశాం. రూ.1000 నుంచి రూ. 2016, వికలాంగులకు రూ.1500 నుంచి రూ. 3016లు అందజేస్తాం.
5. నిరుద్యోగ భృతిపై ప్రభుత్వ ఏర్పడిన తరువాత నియమ, నిబంధనలు ఏర్పాటు చేసి రూ. 3016 అందజేస్తాం. 
6. సొంత స్థలం ఉన్నవారికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం
7. రూ.2వేల కోట్లతో ధరల స్థిరీకరణ
8. రెడ్డి, ఆర్యవైశ్యుల కులాలకు కార్పోరేషన్‌లు ఏర్పాటు
9. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పథకాల రూపకల్పన

పైసా పైసా లెక్క చూసుకొని ఈ మేనిఫెస్టో ప్రకటిస్తున్నామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. తమ పార్టీ చేసేదే చెబుతుందన్నారు. తెలంగాణలో ఆంధ్ర-తెలంగాణ అనే బేధం లేదన్నారు. ఇక్కడ నివసిస్తున్న ఆంధ్రవారు తెలంగాణవారిగా చెప్పుకోవాలని సూచించారు. పూర్తిస్థాయి మేనిఫెస్టోను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement